Saturday 17 September 2016

రాష్ట్ర భాష హిందీ -హిందీ దివస్‌

మన జాతీయ భాష హిందీ. ప్రపంచ భాషలలో చైనీస్‌ తరువాత అత్యంత ప్రాచుర్యం ఉన్న భాషగా గుర్తింపు పొందింది. జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ భాష తోడ్పడుతోంది. బుధవారం హిందీ భాషా దివస్‌(హిందీ భాషా దినోత్సవం). ఈ నేపథ్యంలో హిందీ భాష విశిష్టతలపై ప్రత్యేక కథనం..
‘హిందీ భాష హమారి జాన్‌ హై, హమారి పహ్‌చాన్‌ హై’ అంటూ దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ హిందీ భాష ఔన్నత్యాన్ని చాటారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ భాషను విస్తృతంగా వాడుకున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడేది హిందీ భాష. ఇది దేశ ప్రజల మధ్య సంధాన భాషగా ఉపయోగపడుతోంది. దేశ జాతీయ భాషగా రాజ్యాంగం హిందీని గుర్తించిన సెప్టెంబర్‌ 14ను దేశంలో హిందీ దివస్‌గా జరుపుకుంటున్నారు. 
దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందీ అధికార భాష. 
దేశ అధికార భాషగా హిందీ ఉంటుందని రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదే ఆర్టికల్‌లో రాజ్యంగం అమలులోనికి రాగానే 15 సంవత్సరాల వరకు అన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంగ్ల భాష ప్రయోగం కూడా చేయవచ్చని పేర్కొన్నారు. 1965కు ఆ నిబంధన పూర్తి కావాలి. కానీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఆంగ్లభాషనే ఇంకా వ్యవహారంలో ఉంచి హిందీ భాషకు ద్రోహం చేస్తున్నారని హిందీ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
హిందీ భాష లిపి దేవనాగరి లిపి. 
హిందీ భాషకు పశ్చిమ హిందీ, పూర్వీహిందీ, ఖడీబోలీ, రాజస్థానీ, పహడీ, బీహారీ లాంటివి ఉపభాషలు.
హిందీ భాషలో సూరదాసు సూర్యుడిగా, తులసీదాసు చంద్రుడిగా గుర్తింపు పొందారు. వీరు రాసిన సూర్‌సాగర్, రామచరితమానస్‌లు జీవగ్రంథాలుగా పేరుపొందాయి.
మీరాబాయి కృష్ణుని భక్తిలో లీనమై రాసిన భజన పాటలు పదావళిలో ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో సమాజానికి దిశా నిర్దేశం చేసిన రచనల్లో మీరాబాయి రచనలు ప్రముఖంగా నిలిచాయి.
సమాజంలోని దురాచారాలను తొలగించడానికి కబీర్‌దాస్‌ అనే హిందీ ప్రజాకవి చాలా తోడ్పడ్డారు. అనైతిక దృశ్యం ఏది కనిపించినా తన రచనలు, దోహాలలో ఎత్తి చూపారు. ఆయన కవిగానే కాకుండా సంఘ సంస్కర్తగా పేరుపొందారు. బీజక్‌ ఇతని ప్రధాన గ్రంథం. ‘సాఖీ, సబద్, రమైనీ’ దీనిలోని భాగాలు, ‘తెలుగు కవి వేమనను ఆంధ్ర కబీర్‌గా పిలుస్తారు.
స్వాతంత్య్రోద్యమంలో హిందీ భాష కీలకపాత్ర పోశించింది. దేశ ప్రజలందరినీ ఏకం చేసి వారి భావాలను పంచుకోవడానికి దోహడపడింది. భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతాభావాన్ని పెంపొందించింది.
హిందీ భాష హమారీ జాన్‌హై, హమారీ పహ్‌చాన్‌ హై అంటూ మహాత్మాగాంధీ హిందీని కీర్తించారు. దక్షిణభారత హిందీ ప్రచార సభ ఏర్పాటుకు, దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రచారానికి, వ్యాప్తికి మహాత్మాగాంధీ కృషి చేశారు.
ప్రపంచంలో 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. హిందీకి దేశంలోనే కాక, విదేశాల్లోనూ క్రేజ్‌ ఉంది.
భారత మాజీ ప్రధాని అటల్‌బీహారీ వాజ్‌పేయి హిందీ భాషలో ఐక్య రాజ్యసమితిలో మాట్లాడి హిందీ భాషా మాధుర్యాలను ప్రపంచానికి తెలియజేశారు.
జాతీయ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు
– గఫూర్‌శిక్షక్, హిందీ శిక్షక్‌ సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు
భాషలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య విధానాలను అనుసరిస్తున్నాయి. జాతీయ భాషగా గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ అమలులోకి రాకుండా, ఆంగ్లభాషను వాడుతూ హిందీకి సరైన గౌరవం ఇవ్వడం లేదు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడంలో ఉపయోగపడిన హిందీని కాపాడుకోవడమే కాదు.. తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


భారతదేశ జాతి సమైక్యతకు ప్రతీకగా హిందీ భాష నిలుస్తోంది. విభిన్న భాషల సమాహారంగా ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించే సమయంలో గాంధిజీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవారు. జాతి మొత్తం ఆ భాషను సులువుగా అర్థం చేసుకునేది. అందుకే 1949 సెప్టెంబర్‌ 14న హిందీని జాతీయభాషగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజల మధ్య సద్భావన, సంస్కతిని కాపాడడంలో హిందీకి అధికార భాష హోదానిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 343(1) రూపొందించారు. అప్పటి నుంచి హిందీ రాజ‡భాషగా హోదాను సంతరించుకుంది. ‘దేవనాగరీలిపి’గా పేరొందిన హిందీని ఎందరో మహాకవులు, రచయితలు సుసంపన్నం చేశారు. వారిలో అనంత వాసులూ ఉన్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో పాటు హిందీ ప్రచారానికి తమ వంతు కషి చేస్తూ రాజభాషను అందరికీ దగ్గర చేస్తున్నారు.


విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ
విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ పెంచుకునేలా ఆ భాషలోనే బోధించేలా ప్రభుత్వం సన్నాహాలు చేయాలి. తెలుగుభాషకు ప్రాధాన్యత కల్పించినట్లు హిందీభాషకు కూడా ప్రాముఖ్యత అందించాలి.  ఆంగ్లంపై వ్యామోహాన్ని తగ్గించి జాతీయభాష హిందీని నేర్చుకుని మాట్లాడేలా చొరవచూపాలి. ప్రతి పరీక్షల్లో హిందీభాషలో క్వాలీఫై మార్కులు వస్తేచాలని చెబుతుంటారు. అలా కాకుండా హిందీలో వచ్చిన మార్కులను అన్ని సబ్జెక్టులతోపాటు లెక్కిస్తే హిందీభాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది.
– వేణుగోపాలాచార్యులు, హిందీ పండిట్‌

బోధనా భాషగా హిందీని చేర్చాలి
జాతీయభాష అయిన హిందీని విస్మరించడం శోచనీయం. ప్రభుత్వం స్పందించి బోధనాభాషగా హిందీని పెట్టి ఆంగ్లంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించాలి. ఇటీవల హిందీ నేర్చుకునేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు కూడా ఆంగ్లభాష కాకుండా హిందీ వచ్చినవారికే కల్పించేలా ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టాలి.
– ఎం.రియాజ్‌ బాషా, ఉపాధ్యాయుడు, వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల

రచనల్లో మేటి  డా.జూటూరు షరీఫ్‌
అనంత కీర్తిని జిల్లా ఎల్లలు దాటించిన హిందీ ప్రచారకులలో జూటూరు షరీఫ్‌ ఒకరు. ద్విభాషా కవిగా గుర్తింపు పొందిన ఆయన హిందీ పండితునిగా ప్రస్తుతం ధర్మవరం మండలం చిగిచెర్లలో పనిచేస్తున్నారు. భాషా ప్రచారానికి గతేడాది  రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. కెరే జగదీష్‌ రచించిన ‘రాత్రి సూర్యుడు’ రచనకు షరీఫ్‌  అనువాదం చేసిన  ‘నిశిధికీ సూర్య్‌’ ఎందరినో ఆలోచింపజేసింది. ముఖ్యంగా కబీర్‌ అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల చేత భాషా ప్రవీణ పరీక్షలను రాయిస్తూ హిందీ పట్ల అభిమానాన్ని పెంచుతున్నారు. హిందీ జాతీయ సదస్సుల్లో అనంత తరుపున తరచుగా వెళ్లే షరీఫ్‌ మాట్లాడుతూ ‘  జాతీయ స్థాయిలో జాతీయ సమైఖ్యతకు ప్రతిరూపంగా నిలిచిన హిందీభాషను  చిన్నచూపు చూడొద్దంటారు.

సేవకు ప్రతి రూపం
ఆరు పదులు దాటిని తరగని ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనే సూర్యనారాయణరెడ్డి హిందీ భాషా ప్రచారకునిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుగడించారు. ‘భారతీయ మైత్రికి ప్రతిబింబమైన హిందీని అందరూ అభ్యసించాలి. దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. వారి సాహిత్యాన్ని సంస్కతీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి హిందీభాషే చక్కటి వారధి. అంతేగాక  ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం ద్వారా ఉత్తమ పౌరులుగా దేశసమగ్రతకు పాటుపడతామన్న సద్భావం అందరూలోనూ రావాలి’ అని ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి అన్నారు.




No comments:

Post a Comment