Saturday 17 September 2016

ఉపాధికి ‘హిందీ’ హామీ! ఈనాడు పేపర్ యొక్క చదువు లోని సారాంశం


ఉపాధికి ‘హిందీ’ హామీ! ఈనాడు పేపర్  యొక్క  చదువు లోని సారాంశం

జాతీయభాష హిందీలో ప్రావీణ్యం చేకూర్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్‌ దక్షిణ భారతదేశంలో అనేక సంస్థలు వివిధ కోర్సుల రూపంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులు భాషా అధ్యయనానికి తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి!

స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశభక్తిని మేల్కొలిపి సమైక్యతా రాగం పాడేందుకు హిందీఎంతో ఉపయోగపడింది. ఈ భాషను దీన్ని మాట్లాడే ప్రాంతాలతో పాటు హిందీతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసేందుకు మహాత్మాగాంధీ దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచార సభను మద్రాసులో నెలకొల్పారు. ఈ సభ ద్వారానే హిందీ భాషా ప్రచారం విస్తృతమైంది.
దేశవ్యాప్తంగా ఇరవై వరకు ప్రచార సంస్థలు హిందీ కోర్సులను రూపొందించి పరీక్షల నిర్వహణ, ప్రమాణ పత్రాల జారీ, వాటికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల గుర్తింపు తదితర అంశాల బాధ్యత చూస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా ఎంతోమంది హిందీ ఉపాధ్యాయులుగానే కాకుండా కేంద్రప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాలలో, సివిల్స్‌ పరీక్షలలో సైతం ప్రాధాన్యం పొందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో హిందీభాషాధ్యయనం కోసం కోర్సులు అందిస్తున్న వివిధ ప్రచార సంస్థలు: 1) హిందీ ప్రచార సభ, హైదరాబాద్‌ 2) దక్షిణ భారత హిందీ ప్రచారసభ (చెన్నై) 3) హిందీ సాహిత్య సమ్మేలన్‌, అలహాబాద్‌ (ప్రయాగ) 4) కేంద్రీయ హిందీ సంస్థాన్‌, హైదరాబాద్‌
వీటిలో గుర్తింపు పొందిన వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
1. హిందీ ప్రచార సభ- హైదరాబాద్‌ 
1935లో హిందీ భాషాభివృద్ధి కోసం దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ చొరవతో ఆంధ్ర మహిళాసభ ప్రాంగణంలో హైదరాబాద్‌ -హిందీ ప్రచార సభఏర్పాటయింది. ఈ సభ ద్వారా విశారద్‌, భూషణ్‌, విద్వాన్‌ కోర్సులు చేయవచ్చు.
విద్వాన్‌పూర్తి చేసుకున్నవారు హిందీ పండిట్‌ శిక్షణ కోర్సు చేయడానికి అర్హత పొందుతారు.
ప్రతి ఏడాదీ ఈ పరీక్షలు మార్చి, సెప్టెంబర్‌ (రెండో శనివారం, ఆదివారం)ల్లో నిర్వహిస్తారు.

వివరాలకు హిందీ ప్రచారసభ (హైదరాబాద్‌), హిందీ భవన్‌, నాంపల్లి స్టేషన్‌రోడ్‌, హైదరాబాద్‌-1లో సంప్రదించవచ్చు. ఈ సభ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాదీ హిందీ పండిట్‌ శిక్షణ కోర్సులకోసం ఎల్‌పీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులతో బహుళైచ్ఛిక జవాబులిచ్చే ప్రశ్నపత్రం ఉంటుంది. మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి, కౌన్సెలింగ్‌ ద్వారా వివిధ శిక్షణకేంద్రాల్లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాలవ్యవధి ఒక సం॥. ఈ కోర్సులు చేసినవారు రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులు. డీఎస్సీ ద్వారా ఎంపికైనవారు హిందీ పండిట్‌ గ్రేడ్‌- 2, స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీగా నియమితులవుతారు.
2. దక్షిణ భారత హిందీ ప్రచార సభ-చెన్నై 
1918లో మహాత్మాగాంధీ ఈ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థ నిర్వహణలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ కర్ణాటక, కేరళ, వూటీ, కొత్త దిల్లీ సంస్థ ద్వారా వివిధ డిగ్రీలు, కోర్సులలో ఎందరో ప్రావీణ్యం సంపాదించారు.
1964లో పార్లమెంట్‌లో బిల్లు ద్వారా ఈ సభకు విశ్వవిద్యాలయ హోదా కూడా లభించింది.
ప్రవేశిక, విశారద, ప్రవీణ కోర్సులను ఇక్కడ చేయవచ్చు. ప్రవీణకోర్సు పూర్తిచేసినవారు హిందీ పండిట్‌శిక్షణ కోర్సుకు అర్హులు. తదుపరి చేసే నిష్ణాత్‌కోర్సు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో సమానం. ఈ కోర్సుల అధ్యయనం హిందీ సాహిత్యం, కావ్యాల పట్ల అభిరుచిని పెంచుకోడానికి దోహదపడుతుంది. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కృష్ణా పుష్కరాల మూలంగా ఈ పరీక్షలు సెప్టెంబరుకు వాయిదా పడ్డాయి. సభ నిర్వహించే పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సుల శిక్షణ కేంద్రాలు విజయవాడ, తెనాలి, అవనిగడ్డ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంతకల్‌ ప్రాంతాల్లో ఉన్నాయి.
బి.ఎడ్‌. కోర్సులు 
దక్షిణ భారత హిందీ ప్రచార సభ (చెన్నై) ఆధ్వర్యంలో విజయవాడ (మాచవరం), విశాఖపట్నం (ఆరిలోవ)లలో ఏడాది కాల వ్యవధితో బి.ఎడ్‌. (హిందీ) కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశం కోసం విద్వాన్‌, ప్రవీణ (మధ్యమ, విశారద)లలో ఉత్తీర్ణతతోపాటు బి.ఎ./బి.కాం/బి.ఎస్సీ డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రతి ఏడాదీ- జూన్‌/జూలై నెలల్లో ప్రవేశ ప్రకటన వెలువడుతుంది. ఒక్కో ప్రాంతానికి 100 చొప్పున మొత్తం 200 సీట్లు, హైదరాబాద్‌ కేంద్రంలో 100 సీట్లు అందుబాటులో ఉంటాయి.
దూర విద్యా కోర్సులు: 
* బి.ఎ. (హిందీ) అర్హత: 10+2తో హిందీ ద్వితీయ భాష/ విశారద/ ప్రవీణ తత్సమాన కోర్సులు చదివి ఉండాలి. (10+2 + విశారద + ప్రవీణ)
* ఎం.ఎ. (హిందీ) అర్హత: 10+2+3తో ప్రవీణ లేదా బి.ఎ., (హిందీ) డిగ్రీ
* ఎమ్‌.ఫిల్‌. (హిందీ) అర్హత: ఎమ్‌.ఎ. హిందీ సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత (10+2+3) కలిగి ఉండాలి.
* పి.హెచ్‌.డి. (హిందీ) అర్హత: ఎమ్‌.ఫిల్‌. (హిందీ/ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 5 సం॥ బోధన అనుభవం/ ఎం.ఎ. హిందీ - ప్రవేశ పరీక్షతోపాటు మౌఖిక పరీక్ష ఉంటుంది.
వివరాలకు: డైరెక్టర్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ద.భా. హిందీ ప్రచార సభ, తనికచర్లం రోడ్‌, త్యాగరాయనగర్‌, చెన్నై600 017. సంప్రదించవచ్చు. వెబ్‌సైట్‌ కూడా దర్శించవచ్చు.
3. హిందీ సాహిత్య సమ్మేళన్‌, అలహాబాద్‌ 
1910 సం॥లో ఈ సంస్థ హిందీ భాషేతర ప్రాంతాల్లో హిందీ భాష ప్రచారం కోసం రాజర్షి పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌ సారథ్యంలో ఏర్పడింది. ఈ సంస్థ నిర్వహించే ముఖ్యమైన హిందీ పరీక్షా కోర్సుల్లో ప్రాధాన్య క్రమంలో- ప్రథమ’ (ఎస్‌.ఎస్‌.సి.తో సమానమైనది), మధ్యమ (విశారద) - డిగ్రీతో సమానమైనది, ‘ఉత్తమ’- సాహిత్యరత్న (పి.జి. హిందీ లేదా బి.ఎ. (ఆనర్స్‌)తో సమానమైనది).
ఈ సంస్థ మధ్యమ’ (విశారద) కోర్సు పూర్తిచేసినవారు హిందీ పండిట్‌ శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ఉత్తమ’ (సాహిత్యరత్న) కోర్సు పూర్తిచేసినవారు నేరుగా జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు అర్హులు. దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ సంస్థ నిర్వహిస్తున్న కోర్సులకు గుర్తింపునిచ్చాయి. ప్రభుత్వం నిర్వహించే డీఎస్‌సీకి అర్హత ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత ర్యాంకుల మెరిట్‌ ప్రకారం ప్రభుత్వ పాఠశాల హిందీ పండిట్‌ పోస్టుకు నియామకం జరుగుతుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో హిందీ లెక్చరర్‌ పోస్టులకు- హిందీ సాహిత్య సమ్మేళన్‌, అలహాబాద్‌ నిర్వహించే ఉత్తమ’ (సాహిత్యరత్న) పి.జి. హిందీతో సమాన అర్హత కల్పించింది.
ఈ సంస్థ నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వివరాలు... 
* ప్రథమ ఎస్‌.ఎస్‌.సి. (పదో తరగతి) * మధ్యమ (విశారద) బి.ఎ. (గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ) * ఉత్తమ (సాహిత్య రత్న) బి.ఎ. ఆనర్స్‌/ పి.జి. హిందీ 
ఈ కోర్సుల పరీక్షలు ప్రతీ ఏడాదీ డిసెంబరు నెలాఖరున జరుగుతాయి. సంస్థ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడవచ్చు.
దూరవిద్య ద్వారా ... 
కేంద్రీయ హిందీ సంస్థాన్‌, ఆగ్రా ద్వారా హిందీ కోర్సులు పూర్తి చేయటానికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నది. హైదరాబాద్‌లోని తన శాఖ ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువౌతోందీ సంస్థ.
విద్వాన్‌ / ప్రవీణ / మధ్యమాలలో ఏదైనా ఒక హిందీ కోర్సు పూర్తి చేసివుండి ఇంటర్‌ చదివిన అభ్యర్థులకు సంస్థాన్‌ రెండేళ్ళ బి.ఎడ్‌ (హిందీ) కోర్సులో ప్రవేశానికి అర్హత కల్పించింది. దీనికి విద్యావాలంటీర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం. (కనీసం 3 సం॥రాల బోధన అనుభవం అవసరం).
బీఏ / బీకాం/ బీఎస్సీలలో హిందీని ఒక సబ్జెక్టుగా / ద్వితీయ భాష హిందీ చదివివుండాలి.
వివరాలకు: * కేంద్రీయ హిందీ సంస్థాన్‌ / హిందీ సంస్థాన్‌మార్గ్‌, ఆగ్రా - 282005. 
: * కేంద్రీయ హిందీ సంస్థాన్‌, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ రోడ్‌, శివంరోడ్‌వైపు, హైదరాబాద్‌- 500007. 
: * కేంద్రీయ హిందీ సంస్థాన్‌, సూర్యముఖి భవన్‌, శ్రీ అరవింద్‌ మార్గ్‌, న్యూదిల్లీ- 110 016.

కేంద్ర ఉద్యోగాల్లో... 
సివిల్‌ సర్వీసు పరీక్షా విధానంలో మార్పులతో వెలువడుతున్న ప్రశ్నపత్రం ఇంగ్లిషు, హిందీ భాషల్లో ఉంటుంది. ఇలా రెండు భాషల వర్షన్‌లలో ఉంటున్న ప్రశ్నపత్రంలో వెయిటేజి అధికంగా ఉండే కాంప్రెహెన్షన్‌లో మొదటి దానిలో ఆంగ్లంలో ఉన్నదాన్ని అర్థం చేసుకొని, దాని కింద ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవలసి వుంటుంది. ఈ విభాగంలో ప్యాసేజీలు, ప్రశ్నలు ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి.
జనరల్‌స్టడీస్‌లో వచ్చే ప్రశ్నలు ఆంగ్లంతో పాటు హిందీ భాషలో వుంటాయి. ఏదైనా ఒక అంశంపై విస్తృతంగా ఉన్న సమాచారాన్ని అభ్యర్థి ఎంత మేరకు, ఎంతవేగంగా, ఎంత బాగా అర్థం చేసుకోగలడు, విభిన్న కోణాల్లో ఎంతమేరకు ఆలోచించగలడు అన్నది పరీక్షించటం ఈ విభాగం ఉద్దేశం. అయితే ప్రశ్నల విస్తృతిని హిందీ మాతృభాషగా ఉన్న అభ్యర్థి గానీ, హిందీ ప్రావీణ్యం పొందివున్న అభ్యర్థులు గానీ లబ్ధిపొందేట్లుగా, హిందీతర ప్రాంత అభ్యర్థులు పొందలేక పోతున్నారనేది వాస్తవం. ఒకవేళ ఆంగ్లంలో కఠినంగా కానీ, సమగ్రంగా లేని ప్రశ్నలు హిందీలో చదివి అర్థం చేసుకొని జవాబులు ఎంచుకోవడం సులభమౌతుంది.


No comments:

Post a Comment